దర్శకుడిగా మారుతోన్న మరో స్టార్‌ రచయిత

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కొరటాల శివ వంటి వారంతా మాటల రచయితలుగా చిత్రసీమలో అడుగుపెట్టి తర్వాతి కాలంలో మెగాఫోన్‌ చేతబట్టి దర్శకులుగానూ సత్తా చాటారు. ప్రస్తుతం వీరు టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్లుగా వెలుగులు చిందిస్తున్నారు. వీరి స్ఫూర్తితోనే తర్వాత కోన వెంకట్‌, వక్కంతం వంశీ, ప్రశాంత్‌ వర్మ వంటి మరికొద్ది మంది రచయితలు కూడా ఇదే బాటలో నడిచారు. కానీ, త్రివిక్రమ్‌, కొరటాల శివల స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేక పోయారు. ఇప్పుడు తాజాగా మరో యువ రచయిత కూడా మెగాఫోన్‌ చేతబట్టేందుకు సిద్ధమవుతున్నాడట. ఆయన మరెవరో కాదు ప్రసన్నకుమార్‌.


‘నేను లోకల్‌’, ‘సినిమా చూపిస్త మావ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి హిట్‌ చిత్రాలకు కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే అందించాడు ప్రసన్న కుమార్‌. వీటన్నింటికీ నక్కిన త్రినాథరావు దర్శకుడన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరిదీ మంచి కాంబినేషన్‌ కూడా. ఇటీవలే వీళ్లిద్దరూ కలిసి వెంకటేష్‌కు ఓ కథ వినిపించాగా దానికి ఆయన కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. కానీ, పారితోషికం విషయంలో కొన్ని సమస్యలు రావడంతో ప్రసన్న కుమార్‌ ఆ ప్రాజెక్టు నుంచి బయటకొచ్చేశారట. ప్రస్తుతం ప్రసన్న ఒక్కో చిత్రానికి రూ.1 కోటి వరకు అందుకుంటున్నాడట. వెంకీ చిత్ర విషయంలో మాత్రం దర్శకుడితో సమానమైన రెమ్యునిరేషన్‌ కోరాడట. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరి మధ్య భేదాభిప్రాయాలు తెలెత్తినట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అందుకే ప్రస్తుతం తన వద్ద ఉన్న కథలతో దర్శకుడిగా మారేందుకు సిద్ధమయ్యాడట ప్రసన్న. ఇప్పటికే పలువురు యువ హీరోలను కలిసి కథలు వినిపించాడని త్వరలోనే ఈ యువ రచయిత కూడా దర్శకుడిగా తెరపై దర్శనమివ్వబోతున్నాడని ఫిలింనగర్‌లో గుసగులు వినిపిస్తున్నాయి. అయితే వెంకీ ప్రాజెక్టు నుంచి ప్రసన్న తప్పుకోవడంతో ఆ సినిమా మొదలుకావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయట. త్రినాథరావు మరో రచయితను వెతికి పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారట.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.