హవీష్‌ కొత్త చిత్రం ప్రారంభం

హవీష్‌ కథానాయకుడిగా... రాఘవ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. దేవాన్ష్‌ నామా సమర్పిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. కథానాయకుడిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ క్లాప్‌నిచ్చారు. సదానంద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సునీల్‌ నారంగ్‌ స్క్రిప్ట్‌ని అందజేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిత్ర పరిశ్రమలో 14 ఏళ్లుగా కొనసాగుతున్నా. ‘ఓంకార’ అనే ఇండిపెండెంట్‌ చిత్రాన్ని, ‘లడ్డు’, ‘నన్ను క్షమించు’ అనే లఘు చిత్రాల్ని రూపొందించా. వాటికి పలు పురస్కారాలొచ్చాయి. కొత్త రకమైన రొమాంటిక్‌ కథతో, భావోద్వేగాలకి పెద్దపీట వేస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది. జులై చివరి వారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణని మొదలు పెట్టనున్నాం’’ అన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘నేను కథానాయకుడిగా నటించిన ‘సెవెన్‌’ వచ్చే వారం విడుదలవుతుంది. అభిషేక్‌ నామా ఆ సినిమాని విడుదల చేస్తున్నారు. ఆయన నిర్మాణంలో ఈ సినిమా చేస్తుండడం ఆనందంగా ఉంది. కుటుంబం నేపథ్యంలో సాగే ఒక రొమాంటిక్‌ ప్రేమ కథ ఇది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘సుకుమార్‌, మేం కలిసి నిర్వహించిన లఘు చిత్రాల పోటీలో శశిధర్‌ మొదటి బహుమతిని పొందారు. ఆయన ప్రతిభని చూసే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి.కల్యాణ్‌, బెక్కెం వేణుగోపాల్‌, సుధాకర్‌రెడ్డి, మల్లీడైమన్షన్‌ వాసు, రమేష్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.