క్లాప్‌ క్లాప్‌.. పరుగులు మొదలు

ఆది పినిశెట్టి కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘క్లాప్‌’. ఆకాంక్ష సింగ్‌ నాయిక. బి.కార్తికేయన్‌, ఎం.రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. పృథ్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బుధవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (తెలుగు వెర్షన్‌), నటుడు నాని (తమిళ వెర్షన్‌) క్లాప్‌ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. దర్శకులు బోయపాటి శ్రీను, మలినేని గోపీచంద్‌, బొమ్మరిల్లు భాస్కర్‌ స్క్రిప్టును అందించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘400 మీటర్ల స్ప్రింటర్‌ జీవితంలోని పలు విషయాల సమాహారం ఈ కథ. కొంతమంది అథ్లెట్స్‌ను పరిశీలించి కథని తయారు చేశాను. బయోపిక్‌ మాత్రం కాదు. పరుగు పందెం ప్రారంభానికి రకరకాల పద్ధతుల్ని అవలంబిస్తుంటారు. ఇదివరకు చేతులతో క్లాప్‌ కొట్టి పందెంను ప్రారంభించేవారు. కాబట్టే క్లాప్‌ అనే పేరు పెట్టామ’’న్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ ‘‘క్రీడాకారుల నేపథ్యంలో వచ్చిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుంది. ఇళయరాజాగారు సంగీతాన్నివ్వడం మా అదృష్టం. నా పాత్ర రెండు రకాలుగా ఉంటుంది. అథ్లెటిక్స్‌కి సంబంధించి శిక్షణ తీసుకుంటాను’’ అన్నారు. ఆకాంక్ష సింగ్‌ మాట్లాడుతూ ‘‘తెలుగులో ఓ చిత్రం చేశా. తమిళంలో ఇది నా తొలి చిత్రం. ఇంత మంచి చిత్రంలో భాగం కావడం సంతోషంగా ఉంద’’ని అంది. మరో నాయిక కృష్ణ కురుప్‌ మాట్లాడుతూ ‘‘నేను కూడా అథ్లెట్‌గా నటిస్తున్నా. శిక్షణ తీసుకుంటున్నాను’’ అని చెప్పింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఓ స్పోర్ట్స్‌మన్‌ జీవితంలోని పలు పార్శ్వాల సమ్మేళనం ఇది. ఈనెల 17 నుంచి చిత్రీకరణ కొనసాగిస్తాం. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, మధురైల్లో జరిపే నాలుగు షెడ్యూల్స్‌తో పూర్తిచేస్తామ’’న్నారు. పి.ప్రభాప్రేమ్‌, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.