‘అహం బ్రహ్మాస్మి’.. ఆరంభం

మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం.ఆర్ట్స్‌ పతాకంపై నిర్మలా దేవి మంచు, మనోజ్‌ కుమార్‌ మంచు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియాంక భవాని శంకర్‌ కథానాయిక. సముద్రఖని, మరళీ శర్మ, తనికెళ్లభరణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూరపు సన్నివేశానికి ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్‌ క్లాప్‌ నిచ్చారు. సుస్మిత, మంచు లక్ష్మీ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. విద్య నిర్వాణ మంచు గౌరవ దర్శకత్వం వహించింది. అనంతరం మంచు మనోజ్‌ మాట్లాడుతూ.. ‘‘మూడేళ్ల తర్వాత మళ్లీ మీ ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. అంతా కొత్త బృందంతో చేస్తున్న చిత్రమిది. నా ప్రాణ మిత్రుడు రామ్‌చరణ్, సుస్మిత వచ్చి ఆశీర్వదించడం సంతోషాన్నిచ్చింది. కొత్తవాళ్లు చాలా గొప్ప ప్రతిభతో వస్తున్నారు. అందుకే పాన్‌ ఇండియా చిత్రాన్ని వాళ్ల చేతుల్లోనే పెట్టా. దర్శకుడు రాసుకున్న ఈ కథకు హద్దులు లేవు. నా పాత్ర చాలా బాగుంటుంది. మే నుంచి నెలరోజుల పాటు పీటర్‌ హెయిన్స్‌ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించబోతున్నామ’’న్నారు. ‘‘నన్ను నమ్మి నాకీ అవకాశమిచ్చినందుకు మంచు కుటుంబానికి చిత్ర బృందానికి కృతజ్ఞతలు. సుధీర్‌ వర్మ దగ్గర సహాయ దర్శకుడిగా చేశా. దర్శకుడిగా ఇది తొలి చిత్రం. వినోదాత్మకంగా సాగే క్రైమ్‌ యాక్షన్‌ చిత్రమిది. చాలా థ్రిల్లింగ్‌ అంశాలుంటాయి. మనోజ్‌ పాత్రలో మూడు భిన్న కోణాలుంటాయి. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యముంది. ఈనెల 11 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం. జూన్‌ 6 నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ ఏడాది ఆఖర్లో అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తామ’’న్నారు దర్శకుడు. ‘‘పాటలు ఇప్పటికే పూర్తయ్యాయి. చాలా భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రమిది. రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌ మంచి సాహిత్యాన్నిచ్చార’’న్నారు సంగీత దర్శకులు అచ్చు రాజమణి, రమేష్‌ తమిళమణి. ‘‘నాకిదే తొలి చిత్రం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అంది నాయిక ప్రియాంక. కూర్పు: తమ్మిరాజు, కళ: ఎ.ఎం.వివేక్, ఛాయాగ్రహణం: సన్ని కూరపాటి.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.