సెట్స్‌పైకి ‘అఖిల్‌ 4’

ఖిల్‌ కథానాయకుడిగా జీఏ 2 సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకుడు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి అరవింద్‌ మనవరాలు బేబీ అన్విత క్లాప్‌ నిచ్చింది. మనవడు అల్లు అయాన్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశాడు. నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమంలో అమల, చిరంజీవి సతీమణి సురేఖ, పరశురామ్‌, శ్రీకాంత్‌ అడ్డాల, మారుతి, వెంకటేశ్వరరావు, సత్య తదితరులు పాల్గొన్నారు. ‘‘కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ది అందివేసిన చేయి. తన తొలి సినిమా ‘బొమ్మరిల్లు’తోనే ఓ ట్రెండ్‌ సృష్టించాడు. ఈసారీ అలాంటి మంచి కథని ఎంచుకున్నాడు. యువతరానికి నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. అఖిల్‌ని కొత్త కోణంలో చూపించే కథ ఇది. ఈ కథ నచ్చడంతో దర్శకుడు వాసు వర్మ నిర్మాతగా మారిపోయాడ’’ని బన్నీ వాసు తెలిపారు. ‘‘గీతా ఆర్ట్స్‌లో నాగచైతన్య చేసిన ‘100 పెర్సెంట్‌ లవ్‌’ విజయాన్ని సాధించింది. మరోసారి అక్కినేని వారసుడితో ఈ సంస్థలో ఓ సినిమా రావడం ఆనందంగా ఉంది. ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ తరహాలో వినోదాత్మక చిత్రమిది. కథానాయిక, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంద’’న్నారు వాసు వర్మ. అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మణికందన్‌, సంగీతం: గోపీ సుందర్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.