ఆధ్యాత్మిక సారం.. ‘బాలగోవిందం’

తిరుమల గిరులలో శ్రీ మహావిష్ణువు వెలియడానికి కారణమేంటనే ఇతివృత్తం ఆధారంగా ‘బాలగోవిందం’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు డా.ముళ్లపూడి సూర్యచంద్ర. ఆయన దర్శకత్వంలో తోలేటి వెంకట శిరీష నిర్మిస్తున్నారు. 13 ఏళ్లలోపు బాలలు నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘కలియుగంలోకి శ్రీ వెంకటేశ్వరస్వామి రాకముందు జరిగిన సంఘటనలను ఈ చిత్రంలో చూడొచ్చు. నేటి తరానికి మన సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతని తెలియజేయడమే లక్ష్యంగా రూపొందిస్తున్నాం’’ అన్నారు. తెలుగుతోపాటు కన్నడలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత తెలిపారు. ‘‘ఆధ్యాత్మిక సారంతో కూడిన చిత్రమిది. మన పురాణాల్ని వ్యక్తిత్వ వికాస కోణంలో స్వీకరించాల్సిన ఆవశ్యకతని ఈ చిత్రం తెలియజేస్తుంది’’ అన్నారు గీత రచయిత వెనిగళ్ల రాంబాబు. భక్తి భావనల్ని పెంపొదించే చిత్రమిదన్నారు ప్రభాకర్‌ జైనీ. తన్వి, మోక్షిత, మాచిరాజు, అక్షర, లీలాకృష్ణ, వినీత శ్రీ, ధనుష్‌ సాయి, రోహన్‌ అయా తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: మీర్‌, సంగీతం: సాలూరి వాసూరావు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.