బాలయ్య - బోయపాటి.. కొత్త చిత్రం షురూ!!

బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌కు చిత్రసీమలో మంచి క్రేజ్‌ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడీ ఇద్దరూ ముచ్చటగా మూడోసారి సెట్స్‌పైకి వెళ్లారు. ఇది బాలకృష్ణ నటిస్తోన్న 106వ చిత్రం. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బి.గోపాల్‌ క్లాప్‌ నివ్వగా.. నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. చిత్రసీమ నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వీటిలోని ఓ పాత్ర కోసం ఆయన 25 కిలోల బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూర్చబోతున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య కథానాయకుడిగా నటించిన ‘రూలర్‌’ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘లయన్‌’ తర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.