రాక్షసుడి నుంచి సరికొత్తగా..

ఇటీవలే ‘రాక్షసుడు’ చిత్రంతో చక్కటి విజయాన్ని అందుకోని ఫుల్‌ జోష్‌లోకి వచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఇప్పుడీ ఉత్సాహంలోనే మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారు. దీనికి ‘కందిరీగ’ ఫేం సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్‌ కథానాయిక. సుమంత్‌ మూవీస్‌ పతాకంపై సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌ నివ్వగా.. జెమిని కిరణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాత దిల్‌రాజు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఓ సరికొత్త కథాంశంతో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. శ్రీనివాస్‌ పాత్ర చాలా కొత్తగా, శక్తిమంతంగా ఉంటుంది. నభా పాత్రకీ చక్కటి ప్రాధాన్యముంటుంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘సింగం’ వంటి బాలీవుడ్‌ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేసిన డూడ్లీ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెడుతున్నారు. అడిగిన వెంటనే స్వరాలిచ్చేందుకు ముందుకొచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌కు ధన్యవాదాలు. డిసెంబరు 6 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ‘‘సంతోష్‌ దర్శకత్వంలో చేయడమంటే సొంత కుటుంబ సభ్యులతో కలిసి చేస్తున్నట్లే అనిపిస్తోంది. నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. ‘అల్లుడు శ్రీను’, ‘జయ జానకీ నాయకా’ తర్వాత మళ్లీ ఇప్పుడు దేవిశ్రీ స్వరాలకు స్టెప్పులేయబోతున్నా’’ అన్నారు బెల్లంకొండ శ్రీనివాస్‌. ‘సాయితో కలిసి పనిచేయడం కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నా. నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అంది నభా. ‘‘నాకీ అవకాశమిచ్చిన బెల్లంకొండ సురేష్‌కి కృతజ్ఞతల’’న్నారు నిర్మాత.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.