శుభవార్త వినిపించిన బోయపాటి

‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నారు కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పుడీ ఇద్దరూ ముచ్చటగా మూడోసారి సినీప్రియుల్ని మురిపించేందుకు సెట్స్‌పైకి వెళ్లారు. వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కుతోన్న ఈ కొత్త చిత్రాన్ని మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వారణాసిలో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ శుభవార్త వినిపించారు బోయపాటి శ్రీను. బాలయ్యతో తెరకెక్కిస్తున్న ఈ కొత్త చిత్ర తొలి షెడ్యూల్‌ తాజాగా పూర్తయిందని, ఇందులో భాగంగా ఓ చక్కటి భావోద్వేగభరితమైన సన్నివేశాల్ని చిత్రీకరించినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. రైతన్నల సమస్యల నేపథ్యంతోనే ఈ కథ అల్లుకుంటోన్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పాత్రలో అఘోరాగా దర్శనమివ్వనున్నట్లు సమాచారం అందుతోంది. తాజాగా ముగిసిన వారణాసి షెడ్యూల్‌ ఈ పాత్రపైనే కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.