‘మైదానం’ కోసం సాహసం చేస్తున్నాం

తెలుగులో వచ్చిన అత్యుత్తమ నవలల్లో చలం రాసిన ‘మైదానం’ ఒకటి. తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర భారతీయ భాషల్లో అనువాదమై పాఠకుల ఆదరణ పొందింది. ఇప్పుడా అక్షరాలకు రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు వేణు ఊడుగుల. ‘నీది నాదీ ఒకే కథ’ చిత్రంతో పరిచయం అయిన ఈయన ప్రస్తుతం రానా కథానాయకుడుగా ‘విరాటపర్వం’ తెరకెక్కిస్తున్నారు. అటు దర్శకత్వంతోపాటు నిర్మాతగా మారి ప్రేక్షకులకు మరింత వినోదం అందించబోతున్నారు. 1927లో సాహిత్య ప్రపంచలోకి వచ్చి ఎంతో మందిని ఆలోచింపజేసిన ‘మైదానం’ నవల ఆధారంగా అదే పేరుతో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. కవి సిద్ధార్థ్‌ దర్శకత్వం వహించనున్నారు. దీపావళి సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా వేణు ఊడుగుల మాట్లాడుతూ.. ‘‘చలంగారు 1927లో ఈ నవల రాశారు. చాలామంది మిత్రులతో ఈ నవలను ‘గొప్ప ఆర్టిస్టిక్‌ పీస్‌’ అని ఆయన చెప్పారు. స్వాతంత్య్ర పూర్వ సమాజంలో కుటుంబ సంబంధాల్లో స్త్రీల అమానుషమైన పీడనను చలంగారు ఎంతో కవితాత్మతో, ఆగ్రహంతో ప్రస్తావించారు. ‘మైదానం’లో ప్రతి సన్నివేశం ఆయన జీవితానుభవంలో ఎదుర్కొన్న విషయాలే. ‘మైదానం’లోని రచనా శైలి అన్ని తరాలను ఆకట్టుకుంటుంది. దర్శకనిర్మాతలకే కాదు తెలుగు సినిమాకే చైతన్యంగా నిలిచే అవకాశం ఇస్తుంది కాబట్టి ‘మైదానం’లోకి దూకే సాహసం చేస్తున్నా’మన్నారు.


.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.