అదిరిపోయే ఫైట్లు.. ఆకట్టుకునే స్టెప్పులు

చిరంజీవి ఓవైపు ఉగ్ర నరసింహుడిగా ప్రతినాయకులపై పంజా విసురుతున్నాడు.. మరోవైపు ఆకట్టుకునేలా ఆడిపాడుతున్నారు. మరి చిరు చేసిన ఆ పోరాట ఘట్టాలు ఏ స్థాయిలో ఉన్నాయి.. ఆయన వేసిన స్టెప్పులెంత ఉత్సాహభరితంగా ఉన్నాయి తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు. చిరు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త చిత్ర విశేషాలివి. రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మెగాస్టార్‌కు జోడీగా త్రిష కనిపించనుండగా.. నక్సలైట్‌గా ఓ కీలక పాత్రలో రామ్‌చరణ్ మెవరబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రంకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రంతో డ్యాన్సులు, ఫైట్ల విషయంలో పాత చిరును గుర్తుచేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే చిత్రీకరణ ప్రారంభమైనప్పటి నుంచి సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్‌ ఎపిసోడ్లను పాటలనే షూట్‌ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇప్పటికే మూడు ఫైట్లు.. ఓ పాట చిత్రీకరణను పూర్తి చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాలోని నాలుగో ఫైట్‌ను షూట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘ఆచార్య’ అనే పేరును పరిశీలిస్తోంది చిత్ర బృందం. ఈ ఏడాది ద్వితియార్థంలోనే దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.