క్లాప్ కొట్టేశారు రాజా...!!

'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ' ఫ్లాపు త‌ర‌వాత ర‌వితేజ మ‌రో సినిమా మొద‌లెట్ట‌లేదు,. రెండు మూడు స్క్రిప్టు రెడీ అయ్యాయి. ఎగ్రిమెంట్లు కూడా జ‌రిగిపోయాయి. కానీ... సెట్స్‌పైకి మాత్రం వెళ్ల‌లేదు. ఇదిగో.. ఈరోజే ఓ సినిమా ప‌ట్టాలెక్కింది. అదే 'డిస్కోరాజా'. వి.ఐ ఆనంద్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. సంక్రాంతి త‌ర‌వాత షూటింగ్ మొద‌ల‌వ్వాల్సింది. అయితే... స్క్రిప్టులో మార్పులు చేర్పులూ చేసుకుంటూ వెళ్ల‌డం వ‌ల్ల‌.. షూటింగ్ ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో క్లాప్ కొట్టేశారు. మంగ‌ళ‌వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌ల‌వ్వ‌బోతోంది. రామ్ ఆట్లూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.హాలీవుడ్ చిత్రం 'మిస్ గ్రానీ' క‌థ‌కూ ఈ సినిమాకీ కొన్ని లింకులున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అదే సినిమాని తెలుగులో స‌మంత‌తో రీమేక్ చేయ‌డం 'డిస్కోరాజా' టీమ్ ని షాక్‌కి గురి చేసింది. అందుకే క‌థ‌లో అప్ప‌టిక‌ప్పుడు కొన్ని మార్పులు చేయాల్సివ‌చ్చింది. మ‌రి డిస్కోరాజాకీ స‌మంత సినిమాకీ ఉన్న లింకేమిటో తెలియాలంటే ఇంకొంత‌కాలం ఆగాలి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.