విజయరాజా ‘జెమ్‌’
సీనియర్‌ నటుడు శివాజీరాజా తనయుడు విజయరాజా హీరోగా సందడి చేయబోతున్నారు. ఆయన కథానాయకుడిగా మహాలక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ ‘జెమ్’ టైటిల్‌తో సినిమాను రూపొందిస్తోంది. రాశీ సింగ్‌ కథానాయిక. ఈ సినిమాతో సుశీల సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని శనివారం రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు సి. కల్యాణ్, అజయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ఉత్తేజ్, సంపూర్ణేష్ బాబు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. సి. కల్యాణ్ క్లాప్‌ కొట్టారు, గుంగుల ప్రతాప్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.


ఈ సందర్భంగా విజయరాజా మాట్లాడుతూ.. ‘నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, మీడియా వారికి కృతజ్ఞతలు. యాక్షన్ ఓరియంటెడ్‌గా సినిమా రూపొందనుంది. జులై రెండో వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. తప్పకుండా అందరూ మెచ్చుకునేలా ఈ సినిమా రూపొందుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

అనంతరం శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలకు నా కృతజ్ఞతలు. సుబ్రమణ్యం మంచి కథను రెడీ చేశారు. ఈ సినిమాలోని ఓ పాటను కృష్ణవంశీ చిత్రీకరించనున్నారు. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది’ అని చెప్పారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.