‘హిప్పీ’ ముస్తాబవుతోంది..
‘ఆర్‌ఎక్స్‌ 100’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో యువతరంలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు గుమ్మకొండ కార్తికేయ. ఇప్పుడీ యువ హీరో ప్రముఖ కోలీవుడ్‌ నిర్మాత కలైపులి థాను చిత్రం ‘హిప్పీ’లో నటిస్తున్నాడు. టిఎస్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రిపబ్లిక్‌ డే కానుకగా సినిమా నుంచి మరో పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ప్రచార చిత్రంలో కార్తికేయ చేతిలో బ్యాగ్‌ పట్టుకొని నడుస్తుండగా.. అతన్ని అనుసరించి వస్తున్నట్లుగా కథానాయిక కనిపించింది. ఈ సినిమాలో కార్తికేయ ఓ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. హిప్పీ అనేది 80 - 90 దశకాల్లో బాగా వినిపించిన పేరు. విచ్చలవిడి సంస్కృతికి అలవాటు పడిన యువతీయువకుల సమూహాలను అప్పట్లో హిప్పీగా పిలిచేవారు. ఇలాంటి వారు అప్పట్లో ఎక్కువగా గోవా ప్రాంతాల్లో కనిపించేవారు. ఇప్పుడీ పేరుతోనే సినిమాను రూపొందిస్తుండటంతో కథానాయకుడి పాత్ర ఆ కోణంలోనే సాగబోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహలు చేస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.