‘సరిలేరు నీకెవ్వరు’ సందడి షురూ

ఇటీవలే ‘మహర్షి’గా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపారు మహేష్‌ బాబు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ సందడి చేసేందుకు సిద్ధమైపోతున్నారు. మహేష్‌ కథానాయకుడిగా నటిస్తోన్న 26వ చిత్రమిది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, అనిల్‌ సుంకర, ఎంబీ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈరోజు సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకోని హైదరాబాద్‌లో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా.. ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.

మహేష్‌పై ప్రత్యేక వీడియో..
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ.. చిత్ర బృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇందులో ‘రాజకుమారుడు’ దగ్గర నుంచి మహేష్‌ నటించిన సినిమాలన్నిటి టైటిల్స్‌ను చూపించారు. సిల్వర్‌జూబ్లీ పూర్తి చేసుకున్న మహేశ్‌ ఈ చిత్రంతో స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్నారని పేర్కొంటూ రూపొందించిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ఇక టైటిల్‌ చివర్లో తుపాకీ దానిపై సోల్జర్‌ క్యాప్‌ చూస్తుంటే ఇది ఆర్మీ నేపథ్యంతో కూడిన సినిమా అని అర్థమవుతోంది. చివర్లో.. ‘మహేశ్‌ నటించే 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరూ 2020 సంక్రాంతికి విడుదల’ అంటూ కృష్ణ ప్రకటించారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.