మన్మథుడు మరీ ఇంత స్పీడా!!

‘అయ్యో రామా... ఈ భామ.. భలే ముద్దొస్తున్నాదే, అయ్యో రామా... అందంతో నన్ను చంపేస్తున్నాదే’ అంటూ ‘మన్మథుడు’ చిత్రంలో నాగార్జున చేసిన అల్లరి ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచింది. అదే తరహాలో ఆయన మరోసారి అందమైన భామలతో కలిసి సందడి చేయబోతున్నాడు. ‘మన్మథుడు2’ చిత్రంతో! నాగార్జున కథానాయకుడిగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సమంత, కీర్తిసురేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ కలిసి రూపొందిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున, పి.కిరణ్‌ నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నాగార్జున, ఇతర చిత్రబృందంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇదే షెడ్యూల్‌లో కీర్తిసురేష్‌ కూడా చిత్రబృందంతో కలవనున్నట్టు సమాచారం. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఇప్పటికే సింహభాగం పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రచార చిత్రాల్ని నాగార్జున ట్విటర్‌ ద్వారా బయట పెట్టారు. హుషారైన ఆయన రూపం అభిమానుల్ని ఆకర్షిస్తోంది. ‘మన్మథుడు’ తరహా వినోదంతో ఈ చిత్రం రూపొందుతోందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్, సంగీతం: చైతన్య భరద్వాజ్‌.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.