‘22’ వెనుక ఆ మర్డర్‌ మిస్టరీ ఏంటి?

రూపేష్‌ కుమార్, సలోని మిశ్రా నాయకానాయికలుగా నటిస్తోన్న చిత్రం ‘22’. శివకుమార్‌ బి దర్శకత్వం వహిస్తున్నారు. మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సాయిధరమ్‌ తేజ్‌ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్‌ క్లాప్‌ నివ్వగా.. నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్, నవీన్‌ ఎర్నేని, కొండా కృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. భీమినేని శ్రీనివాస రావు గౌరవ దర్శకత్వం వహించారు. హరీష్‌ శంకర్‌ స్క్రిప్ట్‌ అందించారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘మారుతి, పూరి జగన్నాథ్, వి.వి. వినాయక్‌ల స్ఫూర్తితోనే దర్శకుడిగా మీ ముందుకొస్తున్నా. నేను వీరి వద్ద పనిచేశా. మా అమ్మ బి.జయ వద్ద ప్రొడక్షన్‌తో పాటు దర్శకత్వ శాఖలోలో మెళకువలు నేర్చుకున్నా. దర్శకుడిగా నా తొలి చిత్రానికి వెంకటేష్‌గారు క్లాప్‌ నివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఓ మర్డర్‌ మిస్టరీ నేపథ్యంతో మిళితమైన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. టైటిల్‌గా ‘22’ సంఖ్యను పెట్టడం వెనుక ఓ ట్విస్ట్‌ ఉంది. అదేంటన్నది థియేటర్లో చూసి తెలుసుకోవాలి. ఈనెల 29 నుంచి రెగ్యులర్‌ షూట్‌ మొదలవుతుంది. టైటిల్‌కు వచ్చే నెల 22న టైటిల్‌ లోగోను విడుదల చేస్తామ’’న్నారు. హీరో రూపేష్‌ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి మంచి నటుడవ్వాలని కోరిక ఉండేది. అది ఈరోజు నెరవేరింది. ఇంతకు ముందు శివకుమార్‌ దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌ చేశా. ఆ సమయంలోనే ‘22’ స్క్రిప్ట్‌ వినిపించారు. చాలా థ్రిల్లింగ్‌ అనిపించింది. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా తొలి చిత్రం ‘ఫలక్‌నుమాదాస్‌’. అందులోని పాత్ర కన్నా భిన్నమైన, సవాల్‌తో కూడని పాత్రను ఇందులో చేస్తున్నా. ఊహించని మలుపులతో ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంద’’న్నారు కథానాయిక సలోని. సంగీతం: సాయి కార్తిక్, ప్రొడక్షన్‌ హెడ్‌: అనీ లామా, ఛాయాగ్రహణం: బి.వి. రవి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.