ఆ హ్యాట్రిక్‌ చిత్రం.. ఇన్నాళ్లకు సెట్స్‌పైకి

నాగశౌర్య - అవసరాల శ్రీనివాస్‌ల కలయికకు చిత్రసీమలో మంచి క్రేజ్‌ ఉంది. గతంలో వీళ్లిద్దరి నుంచి వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్చుతానంద’ చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే ఇప్పుడీ ఇద్దరూ ముచ్చటగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకునేందుకు తిరిగి సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టుపై ఏడాదిన్నర క్రితం నుంచే రకరకాల వార్తలొచ్చాయి. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించబోయే ఈ చిత్రానికి ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు గుసగుసలు వినిపించాయి. కానీ, ఆ తర్వాత మళ్లీ ఎందుకో పక్కకు వెళ్లిపోయింది. అయితే ఇప్పుడీ కథనే శౌర్యతో తెరకెక్కించేందుకు అవసరాల సిద్ధమయ్యారట. ఇది ఓ యువకుడి జీవితంలో జరిగే వివిధ దశల్లో నడిచే ప్రేమకథల సమాహారంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇందులో నాగశౌర్య 7 విభిన్నమైన గెటప్పుల్లో దర్శనమివ్వనున్నాడు. అవన్నీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ఇదే సమయంలో దీని గురించి మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, త్వరలో అమెరికాలో ఓ మేజర్‌ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడీ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నాగøౌర్య నుంచి రాబోతున్న ‘అశ్వథ్థామ’ విడుదలకు సిద్ధమైంది. ఇది జనవరి 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.