రెండో సారి కథ రాశాను

నాగశౌర్య కథానాయకుడుగా ఐరా క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మెహరిన్‌ నాయిక. రమణ తేజ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఉషా ముల్పూరి నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకురాలు నందిని రెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాపిచ్చారు. మరో దర్శకుడు పరశురామ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘‘మా ఐరా క్రియేషన్స్‌ తీసిన తొలి చిత్రం ‘ఛలో’కి నేనే కథని అందించాను. మరోసారి ఈ సినిమా కోసం కథ రాశాను. నిజానికి నా కోసం అమ్మానాన్నలు ఐరా క్రియేషన్స్‌ని ప్రారంభించారు. నా కెరీర్‌లోనే నిలిచిపోయేలా ‘ఛలో’ చిత్రాన్నిచ్చారు. అమ్మానాన్నల రుణం తీర్చుకోవాలి. ఇది నా నైతిక ధర్మం. ఈ పట్టుదలతోనే ఈ మూడో సినిమాకి నేనే కథని రాశాను. నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే ఒక్క అశ్వత్థామ తప్ప అక్కడున్నవారెవ్వరూ ఇదేంటని ప్రశ్నించరు. అలా ప్రశ్నించే అశ్వత్థామలాంటి కుర్రాడి చుట్టూ నడిచే కథ ఇది. అమెరికాలో రమణతేజ పరిచయమయ్యారు. అక్కడి ఫిల్మ్‌ స్కూలులో దర్శకత్వం కోర్సు చేశాడు. ఈ కధని తను ప్రేక్షకులకి నచ్చేలా తెరకెక్కిస్తాడనే నమ్మకం ఉంద’’న్నారు ‘‘కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంది. నాగశౌర్య సరసన నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంద’’ని మెహరిన్‌ చెప్పింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ తరానికి నచ్చే చిత్రమిది. ఇంటిల్లిపాదీ మెచ్చేలా మలుస్తాను. యు.ఎస్‌లోని ఫిలిమ్‌ స్కూలులో కోర్సు చేసిన మనోజ్‌ ఛాయాగ్రహణ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాడు. శ్రీచరణ్‌ ఆకట్టుకునే స్వరాల్ని అందించే పనిలో నిమగ్నమయ్యార’’న్నారు. ‘‘ఈ నెల 13 నుంచి 25 వరకూ విశాఖలో చిత్రీకరణ కొనసాగుతుంది. తదుపరి షెడ్యూల్‌నీ విశాఖలోనే నిర్వహిస్తామ’’న్నారు నిర్మాత. శ్రీచరణ్, మనోజ్‌ రెడ్డి, ఎడిటర్‌ గారీ తదితరులు పాల్గొన్నారు. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.