సరికొత్త ప్రయోగానికి ‘నాంది’ పలికాడిలా..

హాస్యభరిత చిత్రాలతో వెండితెరపై నవ్వులు పంచిన అల్లరి నరేష్‌.. ఇప్పుడు తన పంథా మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. కొంత కాలంగా వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న ఈ అల్లరి హీరో ఇకపై ప్రయోగాత్మక చిత్రాలతోనే ప్రయాణం చేయబోతున్నట్లు అర్థమవుతోంది. దీనికి తాజాగా మొదలైన తన కొత్త చిత్రం ‘నాంది’తో నాంది పలికాడు ఈ యువ హీరో. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. మరో దర్శకుడు సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఈరోజే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది ఈ చిత్రం. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నరేష్‌ ఒంటిపై నూలు పోగులేకుండా తలక్రిందులుగా వేలాడదీసి ఉండి.. పోలీసుల చిత్ర హింసల వల్ల ఒంటినిండా గాయాలతో రక్తసిక్తమై ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా దర్శనమిచ్చాడు. ఇదొక సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రంతో నరేష్‌ వరుస ప్లాప్‌లకు చెక్‌ పెడతాడా? లేదా? తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.