రాజకీయం.. యాక్షన్‌.. వినోదం

నవీన్‌చంద్ర కథానాయకుడిగా యశాస్‌ సినిమాస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. వేణు మదికంటి దర్శకత్వం వహిస్తున్నారు. వి.మంజునాధ్‌ నిర్మాత. సోమవారం హైదరా బాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు సుధీర్‌వర్మ క్లాప్‌నివ్వగా, కృష్ణ చైతన్య కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. మరో దర్శకుడు అనిల్‌కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో చిత్రదర్శకుడు మాట్లాడుతూ ‘‘నా తొలి చిత్రం ‘వెంకటాపురం’ తర్వాత మరో కథాబలమున్న చిత్రం చేయాలని ఎక్కువ సమయం తీసుకొన్నా. రాజకీయ నేపథ్యంలో ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌గా సాగే చిత్రమిది. ముఖ్యమంత్రి తప్పు చేస్తే ఏంటనే అంశం ఈ చిత్రంలో కీలకం. ముఖ్యమంత్రిగా కోట శ్రీనివాసరావు, అతని సోదరుడిగా రావురమేష్‌ నటిస్తారు. అచ్చు సంగీతం సినిమాకి ఆకర్షణవుతుంద’’న్నారు. నవీన్‌చంద్ర మాట్లాడుతూ ‘‘రాజకీయ నేపథ్యమున్న ఈ చిత్రంలో వినోదం, యాక్షన్‌కి ప్రాధాన్యముంది. పది మంచి చిత్రాల్ని తీయాలన్న అభిరుచి ఉన్న నిర్మాత మంజునాధ్‌’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలన్న మా తపనకి అద్దం పట్టే చిత్రమిది’’ అన్నారు. నాజర్‌, సుబ్బరాజు, బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్‌, మొత్త రాజేంద్రన్‌, జోగి నాయుడు, ఆర్‌ఎక్స్‌ 100 విజయ్‌ తదితరులు నటిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.