‘18 పేజస్‌’లో ఏం చెప్పబోతున్నాడు

‘18 పేజస్‌’ టైటిల్‌తో అందరిలో ఆసక్తి పెంచుతున్నాడు యువ కథానాయకుడు నిఖిల్‌. ఈయన హీరోగా దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. కథ, స్క్రీన్‌ప్లే సుకుమార్‌ అందిస్తున్నారు. గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. అల్లు అర్జున్‌ తనయ అర్హా క్లాప్‌ నివ్వగా హన్విత కెమెరా స్విచ్ఛాన్‌ చేసింది. ముహూర్తపు సన్నివేశానికి సుకుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర టైటిల్‌ ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో డబ్బు, చరవాణి, వాచ్, కలం, గులాబి, పూలకుండి దర్శనమిచ్చాయి. వాటితో కథానాయకుడికి ఏం సంబంధం అనే ఆసక్తి పెంచుతున్నాయి. టైటిల్‌కు తగ్గట్లు ఓ పేజీపైనే ఇదంతా రూపొందించిన విధానం ఆకట్టుకుంటుంది. మరి నిఖిల్‌ 18 పేజస్‌ దేని గురించి రాసుకున్నాడు? 18 పేజస్‌లో ఏం చెప్తాడో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభంకానుంది. బన్నీవాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సంగీతం: గోపీసుందర్‌. నాయిక వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.