నిఖిల్‌ కొత్త సినిమా టైటిల్‌ ఎప్పుడంటే?

రాజ్‌ తరుణ్, హెబ్బా పటేల్‌ జంటగా దర్శకుడు సూర్య ప్రతాప్‌ గతంలో తెరకెక్కించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్‌’. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రానికి సహకారం అందించారు. ఈ వినూత్న ప్రేమకథ యువతను అమితంగా ఆకట్టుకుంది. ‘నన్ను లవ్‌ చేయడానికి నా ఫిగర్‌ సరిపోదా’ అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్‌ అలరించింది. వీటికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం తోడై సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడిదే బృందం మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. నిఖిల్‌ కథానాయకుడుగా సూర్య ప్రతాప్‌ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. సుకుమార్‌ కథ, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. మార్చి 5 ఉదయం గం.9లకు టైటిల్‌ ప్రకటించనుంది చిత్ర బృందం. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది. సంగీతం డీఎస్పీనే అందిస్తాడా, లేదా అనేది తెలియాల్సి ఉంది. నాయిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. నిఖిల్‌ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నిఖిల్‌ ఇటీవలే ‘కార్తికేయ 2’ చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా రూపొందుతుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.