బాల ఎన్టీఆర్‌లు వీరేనా?

నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితగాథ ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఎన్టీఆర్‌’. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెల నుంచి మొదలు కాబోతోంది. ఈ బయోపిక్‌కి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు పాత్రల ఎంపికలో చిత్రబృందం బిజీగా ఉంది. బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ కనిపించడం దాదాపుగా ఖాయమైపోయినట్టే. ఇక బాల ఎన్టీఆర్‌గా ఎవరు కనిపిస్తారు? అనేదే ఆసక్తికలిగిస్తుంది. చిన్నప్పటి ఎన్టీఆర్‌లుగా నారా లోకేష్‌ తనయుడు, బాలకృష్ణ ముద్దుల మనవడు దైవాన్ష్‌ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాల్లో బాల ఎన్టీఆర్‌గా... కల్యాణ్‌రామ్‌ వారసుడు శౌర్యరామ్‌ కూడా కనిపిస్తారట. నందమూరి హరికృష్ణగా కల్యాణ్‌ రామ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞని యువ ఎన్టీఆర్‌గా చూపించాలని దర్శకుడు తేజ భావించినా, బాలయ్య మాత్రం సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. మోక్షజ్ఞ ఎంట్రీకి ఇంకా సమయం ఉందని, తనని సోలో కథానాయకుడిగానే తెరపైకి తీసుకురావాలని బాలయ్య భావిస్తున్నారు. ‘ఎన్టీఆర్‌’ని రెండు భాగాలుగా విడుదల చేయాలన్నది బాలయ్య, తేజల ఆలోచన. ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వ్యాసాలు
సంబంధిత ఫోటోలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.