జాగ్రత్త ‘ఏదైనా జరగొచ్చు’
ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకున్న కుర్రాడు అతను. తర్వాత మహా అయితే అతనికి ఉద్యోగం వస్తుంది. లేదంటే పెళ్లవుతుంది. అవేమీ కాకుండా... అతని జీవితంలో ఏదేదో జరిగింది. అదేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు రమాకాంత్‌. ఆయన  దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. శివాజీరాజా తనయుడు విజయ్‌ రాజా కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. పూజ సోలంకి కథా నాయిక. వెట్‌ బ్రెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, సుదర్మ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి.  బాబీ సింహ ప్రతినాయకుడిగా నటించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున విశాఖ పట్నంలో పాటల్ని విడుదల చేస్తారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత విజయ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ ‘‘ఇదొక కామెడీ థ్రిల్లర్‌. పేరుకు తగ్గట్టుగా ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే చిత్రమిది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన కుర్రాడు, అతని స్నేహితుల  నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. బాబీ సింహా ప్రతినాయకుడిగా శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదల చేసిన డిజిటల్‌ పోస్టర్‌కి మంచి స్పందన లభించింది. వచ్చే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు. వెన్నెల కిషోర్‌, రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్‌ పెండ్యాల.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.