మళ్లీ కోర్టుకి పవన్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా గడుపుతూనే రాజకీయాలకు సమయం కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఆయన రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. క్రిష్‌ సినిమా ఇటీవలే రెగ్యులర్‌ చిత్రీకరణను మొదలుపెట్టుకుంది. అయితే తాజాగా పవన్‌ ఈ రెండు చిత్రాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చి రాజకీయ వ్యవహారాల్లో తలమునకలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ‘పింక్‌’ సెట్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనపై కోర్టు హాల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ఆయనతో పాటు నివేదా థామస్‌ కూడా పాలుపంచుకుంటున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రంలోని పవన్‌ పాత్రను పూర్తి చేయనున్నారట దర్శకుడు వేణు శ్రీరామ్‌. ఈ చిత్రం కోసం ‘వకీల్‌ సాబ్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఉగాది కానుకగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను, మే 15న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.