‘క్రాక్‌’లో అదిరిపోయే జాతర

రవితేజ - గోపిచంద్‌ మలినేనిల కలయికకు చిత్రసీమలో మంచి పేరుంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్‌ శీను’, ‘బలుపు’ బాక్సాఫీస్‌ ముందు మంచి విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరి నుంచి రాబోతున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘క్రాక్‌’పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని వాణిజ్య హంగులతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మాస్‌రాజాపై భారీ జాతర సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఈ ఎపిసోడ్లో వందల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు పాల్గొంటున్నారట. ఇది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే ఎపిసోడ్‌లలో ఒకటని తెలుస్తోంది. ఈ నేపథ్యంగా వచ్చే పోరాట సన్నివేశాలు తెరపై సినీప్రియులకు కనులవిందును అందించనున్నాయట. ఈ చిత్రంలో రవితేజ ఓ శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఆయనకు జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తుండగా.. ప్రముఖ నటులు సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తుండగా.. ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.