ఆలియా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ను వదిలేసింది..

ఆలియా భట్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్’ను వదిలి వెళ్లిపోయిందట. రాజమౌళి స్వయంగా ఆమెను దగ్గరుండి సంతోషంగా సాగనంపారట. అదేంటి.. ఆలియా సినిమా నుంచి తప్పుకుంటే జక్కన్న ఆనందంగా పంపించెయ్యడమేంటి అని కంగారు పడుతున్నారా? మరేం లేదండి.. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో ఆలియాకు సంబంధించిన పాత్ర చిత్రీకరణ తాజాగా పూర్తయిందట. అందుకే చిత్ర బృందం ఆమెకు గ్రాండ్‌గా సండాఫ్‌ ఇచ్చి సంతోషంగా ముంబయికి పంపించారట. దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించబోతుండగా.. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనువిందు చేయబోతున్నారు. సీత అనే పాత్రలో చెర్రీకి జోడీగా ఆలియా తళుక్కున మెరవబోతుంది. సినిమాలో ఆమెది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినప్పటికీ ఎంతో ప్రాధాన్యముంటుందని సమాచారం. ఇప్పటికే 70శాతం పైగా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ఎన్టీఆర్‌ - ఒలివియా మోరిస్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇది పూర్తయిన వెంటనే క్లైమాక్స్‌ చిత్రీకరణను షురూ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని దాదాపు 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే చిత్ర రిలీజ్‌ డేట్‌ను 2020 జులై 30గా ప్రకటించినప్పటికీ.. ఈ తేదీ మారే అవకాశాలున్నాయని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. నూతన ఏడాది కానుకగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌లు బయటకొచ్చే అవకాశాలున్నాయని చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.