మోహన్ బాబు కథానాయకుడుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. బుధవారం ప్రధాన తారాగణంపై చిత్రీకరణ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు మోహన్ బాబు. మోహన్ బాబుకు స్టైలిష్ట్‌గా ఆయన కోడలు విరానికా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు కనిపించని లుక్‌లో మోహన్‌బాబుని చూపించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. సరికొత్త నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి ప్రేక్షకుల్లో. మరోవైపు.. సూర్య కథానాయకుడుగా వచ్చిన ‘ఆకాశం నీహద్దురా’ చిత్రంలో మోహన్ బాబు అతిథి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లో అయినా తన నటనతో ఆకట్టుకున్నారు.