నిజ జీవిత థ్రిల్లింగ్‌ కథాంశంతో..
‘చిలసౌ’ వంటి హిట్‌ తర్వాత సుశాంత్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. నూతన దర్శకుడు దర్శన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. హరీష్, రవిశంకర్‌ శాస్త్రి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షి కథానాయిక. ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి యోగీశ్వరీ క్లాప్‌ ఇచ్చారు. వెంకటరత్నం కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నాగ సుశీల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సుశాంత్‌ మాట్లాడుతూ.. ‘‘చిలసౌ’కి పనిచేసిన హరీష్‌ ఈ చిత్రంతో నిర్మాతగా మారడం సంతోషమనిస్తోంది. నాకు దర్శకుడిని పరిచయం చేసింది ఆయనే. ఇకపై మంచి కథా బలమున్న చిత్రాలే చెయ్యాలని మూడేళ్ల కిత్రం ఓ బలమైన నిర్ణయం తీసుకున్నా. సరిగ్గా అలాంటి సమయంలోనే దర్శన్‌ నాకు ఈ కథ చెప్పారు. చాలా కొత్తగా అనిపించింది. ‘చిలసౌ’ పూర్తయిన వెంటనే దీన్నే పట్టాలెక్కించాలనుకున్నా. కానీ, ‘అల.. వైకుంఠపురములో’ వల్ల కాస్త ఆలస్యమైంది. నేను చేస్తున్న తొలి థ్రిల్లర్‌ ఇది. సినిమాలోని కొత్తదనం అందరికీ నచ్చుతుంద’’న్నారు. ‘‘ఢమరుకం’కు సహాయ దర్శకుడిగా చేశా. ఇప్పుడీ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నా. 2010లో చెన్నైలో ఉంటున్నప్పుడు నా స్నేహితుడి జీవితంలో నేను చూసిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చిత్ర కథను రాసుకున్నా. అందుకే ఇది నా మనసుకు ఎంతో దగ్గరయిన కథ. నాపై నమ్మకం ఉంచి ఇంత చక్కటి అవకాశమిచ్చిన సుశాంత్, చిత్ర నిర్మాతలకు ధన్యవాదాల’’న్నారు దర్శకుడు. ‘‘నన్ను నా ప్రతిభను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శన్‌కు కృతజ్ఞతలు. ఆయన కథ రాసుకున్న విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతిఒక్కరికి వినోదాన్ని పంచిస్తుందన్న నమ్మకం ఉంది’’ అంది మీనాక్షి. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మంచి కుటుంబ కథా చిత్రం చెయ్యాలని ఎదురుచూస్తున్న తరుణంలో దర్శన్‌ ఇంత చక్కటి కథతో వచ్చాడు. దీనికి తగ్గట్లుగా సుశాంత్‌ కథలోకి రావడం మరింత సంతోషాన్నిచ్చింది. ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం కీలక పాత్రలు చేస్తున్నారు. ఫిబ్రవరి 1నుంచి నిర్విరామంగా చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.