కేరళ అడవుల్లో ‘సైరా’ పోరు
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌ నిర్మాత. ప్రస్తుతం కేరళ అడవుల్లో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ పది రోజుల పాటు జరగనుంది. హైదరాబాద్‌ తిరిగొచ్చాక మరికొన్ని కీలక సన్నివేశాలు, ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేస్తారు. దాంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. మే నుంచి నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలైపోతాయి. అతి త్వరలోనే విడుదల తేదీ కూడా ప్రకటిస్తారని సమాచారం. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడి కథ ఇది. బ్రిటీష్‌వారితో సైరా నరసింహారెడ్డి ఎలా పోరాటం చేశాడు? తెల్లదొరల వెన్నులో ఎలా వణుకు పుట్టించాడన్న నేపథ్యంలో కథ సాగబోతోంది. కథ ప్రకారం పోరాట సన్నివేశాలకు చాలా ప్రాధాన్యం ఉంది. దాని కోసం చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. కేవలం పోరాట సన్నివేశాలకే చిత్ర బడ్జెట్‌లో 25 శాతం కేటాయించారని తెలుస్తోంది. అమితాబ్‌బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్‌సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు.


* ‘చిత్రలహరి’ నచ్చింది..
సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం చిరుకి బాగా నచ్చిందట. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియపరిచారు. ‘‘సినిమా చక్కగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ ప్రతిభని నిరూపించుకున్నారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, అనుకున్న లక్ష్యం వైపు సాగిపొమ్మని ఓ మంచి సందేశాన్నిచ్చింది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు చిరు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.