విలన్‌ నాని వచ్చేశాడు..

నాని నుంచి ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా అందులో ఏదో కొత్తదనం ఉండి తీరుతుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడిపోయింది. ఆయన కూడా దీనికి తగ్గట్లుగానే వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటుంటాడు. ప్రస్తుతం నాని నుంచి రాబోతున్న సినిమాలన్నీ కూడా దేనికదే ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌లతో రూపుదిద్దుకొంటున్నవే. ఇటీవల వచ్చిన ‘జెర్సీ’లో స్ఫూర్తిని రగిలించే అర్జున్‌ అనే క్రికెటర్‌గా సందడి చేసిన ఈ యువ హీరో.. విక్రమ్‌ కె.కుమార్‌తో చేస్తున్న ‘గ్యాంగ్‌లీడర్‌’ కోసం రివేంజ్‌ డ్రామా రైటర్‌ పార్థసారథిగా నవ్వులు పంచబోతున్నాడు. ఇక వీటిలో ‘వి’ చిత్రమైతే మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఈ మూవీలో నాని ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనువిందు చేయనున్నాడు. తాజాగా ఈ చిత్ర సెట్స్‌లో అడుగుపెట్టాడట నేచురల్‌ స్టార్‌. ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు సుధీర్‌బాబు ట్విటర్‌ వేదికగా అభిమానులకు తెలియజేశారు. నాని 25వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాను విలక్షణ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్నారు. అదితీ రావ్‌ హైదరి, నివేదా థామస్‌ కథానాయికలు. అన్నట్లు మరో విషయం ఏంటంటే.. ‘వి’ కోసం నాని తొలిసారిగా సిక్స్‌ప్యాక్‌లో దర్శనమివ్వబోతున్నాడట. ఇప్పటికే ఈ లుక్‌ కోసం కసరత్తులు కూడా ప్రారంభించేశాడట. దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది స్వరాలు సమకూరుస్తున్నాడు. వచ్చే ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రధమార్థంలో కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.