మిగిలింది ‘వకీల్‌సాబ్‌’ గతమే!!

పవన్‌ కల్యాణ్‌ తన రీఎంట్రీ చిత్రం ‘వకీల్‌సాబ్‌’ను శరవేగంగా పూరి చేస్తున్నారు. బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామస్, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం.. వేసవి కానుకగా మే 15న విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక కేవలం పవన్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. వకీల్‌సాబ్‌ గతంలో ఆయన సతీమణి పాత్ర కూడా కీలకమే. దీని నిడివి చిన్నదే అయినప్పటికీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పుడీ పాత్ర కోసమే శ్రుతిహాసన్‌ను సంప్రదిస్తోంది చిత్ర బృందం. ఇప్పుడా పాత్రకు ఆమె ఫైనల్‌ అయిపోతే త్వరలోనే ఈ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ను కూడా పూర్తి చేసేయ్యాలని చూస్తున్నారట వేణు శ్రీరామ్‌. ఇప్పటికే నిర్మాణాంతర పనులు కూడా మొదలైపోయాయి. వీలైనంత వరకు ఏప్రిల్‌ తొలి వారం నుంచే ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచాలని చూస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘‘మగువా మగువా’’ గీతాన్ని విడుదల చేయగా.. దానికి నెట్టింట మంచి ఆదరణ దక్కుతోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.