‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌కి వరుణ్‌ కొత్త చిత్రం!!

కెరీర్‌ తొలినాళ్ల నుంచి వైవిధ్యభరిత కథలతోనే ప్రయాణం చేస్తున్న వరుణ్‌ తేజ్‌.. గతేడాది ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంతో విలన్‌గానూ మెప్పించారు. ఇప్పుడాయన బాక్సర్‌గా సత్తా చాటేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అల్లు బాబీ, సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్‌లో జరుగుతున్నట్లు వరుణ్‌ తాజాగా ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఈ చిత్రంలో ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించేందుకు గతకొన్నాళ్లుగా ముంబయిలోని ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు వరుణ్‌. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీపై సైతం ఓ స్పష్టత వచ్చినట్లు చిత్ర సీమ నుంచి సమాచారం అందుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ముందుగా రాజమౌళి బుక్‌ చేసుకున్న జులై 30వ తేదీనే ఇప్పుడు వరుణ్‌ బాక్సర్‌గా రాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జక్కన్న తన తేదీని సంక్రాంతికి వాయిదా వేసుకున్న నేపథ్యంలో ఈ తేదీ ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.