రౌడీ పోరాటం ముగిసింది
‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి హిట్‌ తర్వాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఇటీవలే ముంబయిలో చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ తాజాగా ముగిసినట్లు సమాచారం. పదిరోజులకు పైగా సాగిన ఈ షెడ్యూల్‌లో చిత్రానికి కీలకమైన కొన్ని పోరాట ఘట్టాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీనికోసం ముంబయిలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను కూడా డిజైన్‌ చేశారు. అందులోనే ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ చిత్రంలో దేవరకొండ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. దీనికోసం ఆయన థాయ్‌లాండ్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం విజయ్‌ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ప్రచార కార్యక్రమాల కోసం కొంత గ్యాప్‌ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ హడావుడి పూర్తయిన తర్వాత పూరి చిత్ర రెండో షెడ్యూల్‌లో అడుగుపెట్టనున్నారట. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా బాలీవుడ్‌ భామ అనన్య పాండే కనిపించనుందని సమాచారం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.