ప్రియురాలితో బైక్‌పై దొరికేసిన దేవరకొండ

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఓ అమ్మడిని బుట్టలో వేసుకున్నాడు. మరి ఆ ఇద్దరూ ఎక్కడికైనా షికారు కెళ్లారో? లేక ఆ పిల్ల తల్లిదండ్రులు ఓకే చెప్పలేదని చెప్పాపెట్టకుండా తీసుకొచ్చేస్తున్నాడో తెలియదు కానీ, ఆ పిల్లతో బైక్‌పై వెళ్తూ మీడియాకు చిక్కేశాడు. ఇంతకీ రౌడీని మాయ చేసిన ఆ పిల్ల ఎవరు? ఆమెను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న ‘ఫైటర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) వచ్చే వరకు వేచి చూడక తప్పదు. ఎందుకంటే ఆయన బైక్‌పై చెట్టాపట్టాలేసుకోని తిరుగుతున్న ఆ భామ మరెవరో కాదు.. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్య పాండే. ఆమే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రస్తుతం ముంబయిలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ముంబయి వీధుల్లో విజయ్‌ - అనన్యలపై బైక్‌ రైడ్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట లీకయ్యాయి. బయటకొచ్చిన ఈ చిత్రాల్లో బైక్‌పై రౌడీ, అనన్యల కెమిస్ట్రీ ఫుల్‌ హీటెక్కించేలా ఉంది. ఓ ఫొటోలో విజయ్‌ - అనన్య బైక్‌పై వెళ్తుండగా.. వాళ్ల వెనక ఓ విలన్‌ గ్యాంగ్‌ వెంబడిస్తున్నట్లుగా కనిపించింది. మరి ఈ చిత్రం వెనకున్న కథేంటి? ఆ విలన్‌ గ్యాంగ్‌ ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రమిది. విజయ్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడిగా కనిపించబోతున్నారు. కరణ్‌ జోహార్‌, పూరి కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.








Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.