ట్వీట్‌తో కొత్త చిత్రంపై క్లూ ఇచ్చేశాడా??

‘ఫైటర్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా నిరూపించుకునేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నారు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే 40శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇది పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశమున్నా.. ఇప్పటికే విజయ్‌ తర్వాతి ప్రాజెక్టులపైనా ఓ స్పష్టత ఉంది. పూరితో చేస్తున్న ఈ చిత్రం పూర్తయిన వెంటనే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నాడు విజయ్‌. దాని తర్వాత దిల్‌రాజు నిర్మాణంలో ఓ చిత్రం చెయ్యడానికి ఇప్పటికే పచ్చజెండా ఊపేశారు. అయితే దర్శకుడెవరన్నది స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా దేవరకొండ జన్మదినం సందర్భంగా ఓ దర్శకుడు చేసిన ట్వీట్‌ దీనిపై ఓ క్లూ ఇచ్చింది. ఇంతకీ ఆయన మరెవరో కాదు విలక్షణ కథా చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. ‘‘జన్మదిన శుభాకాంక్షలు దేవరకొండ. ఈ ఏడాది నీ నుంచి మంచి సినిమా ఇంకా రావాల్సి ఉంది. నువ్వు చేసే అద్భుతాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అంటూ రౌడీ హీరోకి తాజాగా బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు ఇంద్రగంటి. దీనిపై దేవరకొండ బదులిస్తూ.. ‘‘కృతజ్ఞతలు. ఐతే ఆ అద్భుతం మనిద్దరం కలిసి చెయ్యబోతున్నాం’’ అని ట్వీటారు. దీంతో రౌడీ ట్వీట్‌ కాస్త చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి శివ నిర్వాణ తర్వాత విజయ్‌ చేయబోయే చిత్రం ఇంద్రగంటి దర్శకత్వంలోనే అని ఈ ట్వీట్‌తో హింట్‌ దొరికినట్లయింది. లాక్‌డౌన్‌ పూర్తికాగానే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.