‘విరాటపర్వం’ తొలి ఘట్టం సమాప్తం!
‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే తానేంటో నిరూపించుకున్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. ఇప్పుడీయన నుంచి రాబోతున్న మరో విభిన్న కథా చిత్రం ‘విరాటపర్వం’. రానా - సాయిపల్లవి నాయకానాయికలుగా నటిస్తున్నారు. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 90ల్లో తెలంగాణ ప్రాంతంలో నడిచే ఆసక్తికరమైన కథాంశంతో విభిన్నమైన పీరియాడిక్‌ సోషల్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గత కొన్నిరోజులుగా తెలంగాణలోని ధరిపల్లి గ్రామంలో తెరకెక్కించిన కీలక సన్నివేశాలతో చిత్ర తొలి షెడ్యూల్‌ పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. ఇందులో రానా ఓ నక్సలైట్‌గా కనిపించనుండగా.. సాయిపల్లవి ఓ జర్నలిస్టు పాత్రను పోషిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. టబు ఓ కీలక పాత్రలో తళుక్కున మెరవనుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.