వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ‘22’

రూపేష్‌కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా జంటగా మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. దివంగత దర్శకురాలు బి.జయ తనయుడు శివకుమార్‌.బి తెరకెక్కిస్తున్నారు. సుశీలాదేవి నిర్మాత. ఈ సినిమాకి ‘22’ అనే పేరును ఖరారు చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినిమా పేరును ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ప్రకటించగా, నిర్మాణ సంస్థ లోగోని సి.కల్యాణ్‌ ఆవిష్కరించారు. దర్శకుడు మారుతి, నిర్మాత కొండా కృష్ణంరాజు అతిథులుగా హాజరయ్యారు. వినాయక్‌ మాట్లాడుతూ ‘‘శివకుమార్‌ చాలా సినిమాలకి నా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. క్రమశిక్షణ ఉన్న వ్యక్తి.అతడు పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఒక కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. శివ మా సంస్థలోనూ సినిమాలకి పనిచేశాడ’’న్నారు మారుతి. ‘‘తన అబ్బాయిని దర్శకుడిగా చూసుకోవాలనేది బి.జయ కోరిక. అది నెరవేరినందుకు ఆమె సంతోషిస్తుంటారు. శివ ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్‌. శివకుమార్‌.బి మాట్లాడుతూ ‘‘మారుతి, పూరి జగన్నాథ్‌, వినాయక్‌ల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశా. నృత్య దర్శకురాలు అనీ మాస్టర్‌ నాతో నిర్మాత సుశీలాదేవిని కలిసి కథ చెప్పమన్నారు. మొదట వెబ్‌ సిరీస్‌ చేశాక అదే సంస్థలో సినిమా అవకాశం ఇచ్చారామె. మా అమ్మ దగ్గర నేను మొదట నిర్మాణంలో మెలకువలు, ఆ తర్వాత దర్శకత్వం నేర్చుకున్నా. నాన్న బి.ఎ.రాజు నా ప్రతి అడుగులో తోడుగా ఉన్నార’’న్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సాయికార్తీక్‌, ఫైట్‌ మాస్టర్‌ జాషువా, సహ దర్శకుడు పుల్లారావు కొప్పినీడి, ప్రొడక్షన్‌ హెడ్‌ అనీ లామా తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.