కోతి వేషాల్లోనూ సందేశం!

‘‘హాస్యనటుడు తన గురించి ఆలోచించకుండా ఎదుటివారిని నవ్విస్తాడు. వారి కష్టాన్ని బేరీజు వేయలేం’’ అన్నారు ప్రముఖ నటుడు బ్రహ్మానందం. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘త్రీ మంకీస్‌’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుడిగాలి సుధీర్, గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌ ప్రధాన పాత్రధారులుగా నటించారు. కారుణ్య చౌదరి కథానాయిక. అనిల్‌ కుమార్‌.జి దర్శకుడు. నగేష్‌.జి నిర్మాత. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘‘కోతి వేషాల్లో కూడా అంతర్లీనంగా గొప్ప సందేశం ఉంటుంది. కోతులు కొన్నిసార్లు వాటికి తెలియకుండానే మంచి పనులు చేస్తుంటాయి. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకునే దర్శకుడు ఈ చిత్రాన్ని తీశాడనిపిస్తుంది. ‘జబర్దస్త్‌’ షోతో ఇంటిల్లిపాదినీ నవ్విస్తున్న హాస్యనటులు చేసిన ఈ చిత్రం విజయవంతం కావాలి. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎందుకు కలుస్తారో తెలియదు. కానీ అలా కలవడానికి ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ అంశాన్ని ఇందులో స్పృశించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాని చూశాక ప్రేక్షకులు తప్పక భావోద్వేగానికి గురవుతార’’న్నారు నిర్మాత. ‘‘నవతరం హాస్యనటులందరికీ స్ఫూర్తి బ్రహ్మానందం సర్‌. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నవ్వించే ప్రయత్నం చేస్తుంటాం. ఆయన చేతులమీదుగా మా ట్రైలర్‌ విడుదలవడం ఆనందంగా ఉంది’’ అన్నారు రామ్‌ప్రసాద్, సుధీర్, గెటప్‌ శ్రీను.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.