సందేశంతో ‘త్రీ మంకీస్‌’

సుడిగాలి సుధీర్, గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘త్రీ మంకీస్‌’. కారుణ్యచౌదరి నాయిక. అనిల్‌ కుమార్‌.జి దర్శకుడు. నగేష్‌.జి నిర్మాత. 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల ముందస్తు వేడుక జరిగింది. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నటులు మంచు లక్ష్మి, అలీ, ఆకాష్‌పూరి అతిథులుగా హాజరయ్యారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఈ చిత్ర కథానాయకులకి తప్ప ఇంకెవ్వరికీ ఈ టైటిల్‌ సరిపోదు. ‘జబర్దస్త్‌’ కార్యక్రమంతో అమెరికా వరకు వెళ్లిన ఈ ముగ్గురికి ఈ సినిమాతో మరింత గుర్తింపు వస్తుంది’’ అన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ ‘‘సినిమాలో నటించడం కంటే ‘జబర్దస్త్‌’లో చేయడమే కష్టం. ఈ చిత్ర కథానాయకులు ముగ్గురూ మరెన్నో సినిమాలు చేయాలి. మరింత గుర్తింపు తెచ్చుకోవాలి’’ అన్నారు. అలీ మాట్లాడుతూ ‘‘హిందీలో ‘త్రీ ఇడియట్స్‌’ ఎంత పెద్ద విజయం సాధించిందో, తెలుగులో ‘త్రీ మంకీస్‌’ కూడా అంత పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు అనిల్‌ మాట్లాడుతూ ‘‘ఈ ప్రపంచంలో ఎవరూ ఊరికే చనిపోవడం లేదు. సాయం అనే మందు లేక చనిపోతున్నారనే సందేశం ఇందులో ఉంది. హాస్యంతోపాటు భావోద్వేగాలతో హృదయాలను తాకే విధంగా సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘జబర్దస్త్‌’ నటులతో పాటు చిత్రబృందం పాల్గొంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.