బోల్డ్‌గా ఉన్నా.. సందేశాత్మకంగా

తమిళ బిగ్‌బాస్‌తో ప్రేక్షకుల మదిని దోచుకున్న ఓవియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘90 ఎంఎల్‌’. ఇది చాలా తక్కువ.. అనేది ఉపశీర్షిక. అనితా ఉదీప్‌ దర్శకత్వం వహించారు. మాసుమ్‌ శంకర్, శ్రీ గోపిక కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే తమిళ్‌లో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని కర్ణ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై తెలుగులోకి అనువదిస్తున్నారు నిర్మాత చాంద్‌ బాషా. ఏప్రిల్‌ 26న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘తమిళ్‌లో మూడురోజుల్లోనే రూ.16 కోట్లు సాధించిందీ చిత్రం. ఇప్పుడు తెలుగులో విడుదలవుతోంది. యువతరానికి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి’’ అన్నారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇదొక రొమాంటిక్‌ కామెడీ డ్రామా కథాంశంతో తెరకెక్కింది. బోల్డ్‌గా ఉన్నప్పటికీ మంచి సందేశమున్న చిత్రమిది. ఐదుగురు అమ్మాయిలు తమ స్వేచ్ఛను సాధించుకోవడం కోసం ఏం చేశారన్న నేపథ్యంలో సినిమా సాగుతుంది. విరామం ముందొచ్చే ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయి. తమిళ స్టార్‌ హీరో శింబు ఇందులో అతిథి పాత్రలో కనిపించడంతో పాటు స్వరాలు సమకూర్చారు. ఇవి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ’’న్నారు. ‘‘ప్రతి అమ్మాయి తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి స్వేచ్ఛను కోరకుంటుందన్నది ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చ’’న్నారు నటి మాసుమ్‌ శంకర్‌.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.