తెలుగులో పాడటం చాలా కష్టం


‘‘మా అబ్బాయి, అల్లుడు మార్వెల్‌ సూపర్‌హీరో సినిమాలకి పెద్ద అభిమానులు. వాళ్ల వల్లే నేను ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’కి గీతాన్ని అందించేందుకు ఒప్పుకున్నా’’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌. హాలీవుడ్‌ సూపర్‌హీరో చిత్రం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ఈ నెల 26న తెలుగులో విడుదలవుతోంది. ఈ చిత్రం కోసం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆంథెమ్‌ని సమకూర్చారు ఎ.ఆర్‌.రెహమాన్‌. ‘ఆగేది లేదు ఎదురే అడ్డేమున్నా...’ అంటూ సాగే ఈ గీతాన్ని రాకేందు మౌళి రచించగా, ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వయంగా ఆలపించారు. ఆ పాటతో పాటు తెలుగు ట్రైలర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఎ.ఆర్‌.రెహమాన్‌తో పాటు ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’లో కీలకమైన థానోస్‌ పాత్రకి తెలుగులో డబ్బింగ్‌ చెప్పిన యువ కథానాయకుడు రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెహమాన్‌ మాట్లాడుతూ ‘‘ఇదివరకు వచ్చిన మార్వెల్‌ సూపర్‌హీరోల సినిమాల్ని... ఆ హీరోలకి అభిమానులైన కొత్తతరం ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకొనే ఈ గీతం స్వరపరిచా. తెలుగు పాటని నేనే పాడాల్సి వచ్చింది. తెలుగు పాట పాడటం చాలా కష్టం. మొదట భయపడ్డాను కానీ... ఆ తర్వాత రాకేందు మౌళి ఇచ్చిన సాహిత్యాన్ని అర్థం చేసుకొని పాట పాడా. ఇలాంటి చిత్రాలకి సంగీతం అందించడానికి ధైర్యం కావాలి. విమర్శలు వచ్చినా వాటిని స్వీకరించేందుకు సిద్ధమై పని చేయాలి. దర్శకుడు ఈ పాట విన్నాక.. కొరియన్‌, చైనీస్‌ భాషల్లో కూడా డబ్‌ చేయమన్నారు. ఇదొక పాటలా కాకుండా, ఆంథెమ్‌లాగే భావించి సిద్ధం చేశా. సినిమాతో సంబంధం లేకుండా... విడిగా విన్నా కొత్త ఉత్సాహాన్ని కూడగట్టుకొనేలా ఉంటుంది. ఈ పాట చేయడానికి వారం రోజులు పట్టింది’’ అన్నారు. మీకు ఇష్టమైన సూపర్‌హీరో ఎవరని అడిగిన ప్రశ్నకి బ్లాక్‌ పాంథర్‌ అని సమాధానమిచ్చారు రెహమాన్‌. సంగీతం పరంగా ఇంకా సాధించాల్సిన లక్ష్యాలేమైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకి ఆయన బదులిస్తూ... వర్చువల్‌ రియాలిటీతో పాటు త్రీడీ సినిమాలకి, నేను నిర్మిస్తున్న ‘99 సాంగ్స్‌’ తరహా సంగీత ప్రధానమైన చిత్రాలకి పనిచేయాలని ఉందన్నారు. తదుపరి మణిరత్నం చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నట్టు తెలిపారు. రానా మాట్లాడుతూ ‘‘థానోస్‌ పాత్రకి రెండోసారి డబ్బింగ్‌ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇదివరకు నేను భాగమైన ‘ది అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ ఘన విజయం సాధించింది. ఈ చిత్రాల అభిమానిగా ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించాను. ఇది ఆంగ్లంలో రాసిన కథ. ఇందులో పాత్రలు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు కొన్ని చోట్ల పదాలు వినడానికి ఇబ్బంది కరంగా అనిపిస్తుంటాయి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రానికి మరింత పకడ్బందీగా డబ్బింగ్‌ చెప్పా. పాఠశాల వయసు నుంచే నాకు కామిక్‌ బుక్స్‌ చదవడం అలవాటు. పదేళ్లుగా వస్తున్న మార్వెల్‌ సూపర్‌ హీరో చిత్రాలకి నేను అభిమానిని. అలాంటి చిత్రంలో భాగమయ్యే అవకాశం నాకు రావడం గొప్ప విషయంగా భావిస్తున్నా. ఎ.ఆర్‌.రెహమాన్‌ భాగం కావడంతో ఈ సినిమా భారతీయ ప్రేక్షకులకి మరింత దగ్గరైంది’’ అన్నారు. రాకేందుమౌళి మాట్లాడుతూ ‘‘ఈ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలన్నింటికీ సరిపోయేలా శక్తిమంతంగా పాట ఉండాలని చెప్పారు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ పాట రాశా. చిన్నప్పట్నుంచి నేను, నాన్న వెన్నెలకంటి, పెదనాన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు విని పెరిగాను. వాళ్లని స్ఫూర్తిగా తీసుకొని ఇందులో శక్తిమంతమైన పాటని రాశా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వాల్ట్‌డిస్నీ స్టూడియో ఇండియా హెడ్‌ బిక్రమ్‌ దుగ్గల్‌ పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.