నవ్వులు పంచే ‘ఏబీసీడీ’

సినిమాని ప్రేమించేవాళ్లు ఎక్కువ చిత్రాలు చేయడం వల్ల మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఉంటాయి’’ అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌. ఆయన సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఏబీసీడీ’ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లు శిరీష్‌, రుక్సర్‌ థిల్లాన్‌ జంటగా నటించిన చిత్రమిది. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. డి.సురేష్‌బాబు సమర్పణలో మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 17న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘శిరీష్‌ని నేను ‘జల్సా’ చేస్తున్న సమయంలో చిన్న కుర్రాడిగా చూశా. సినిమాపై మంచి అవగాహన ఉన్న తను మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఈ ట్రైలర్‌ చాలా బాగుంది. ఇద్దరు డబ్బున్నవాళ్లు పడే కష్టాల్ని చూసి ప్రేక్షకులు సరదాగా నవ్వుకునేలా దర్శకుడు తీర్చిదిద్దారు. ‘మెల్లమెల్లగా...’ పాట నాకు నచ్చింది. ఇందులో నటించిన భరత్‌కి నేను అభిమానిని. ‘వెంకీ’, ‘రెడీ’ సినిమాల్లో తన పాత్రల్ని బాగా ఆస్వాదించాను. కాన్సెప్ట్‌ సినిమాల్ని తీసే మధుర శ్రీధర్‌కి సినిమాలంటే ప్రేమ. కథ చెప్పే విధానం, సినిమాలు చూసే విధానం మారాలంటే మధుర శ్రీధర్‌లాంటి నిర్మాతలు పరిశ్రమలో ఉండాలి. దర్శకుడు తొలి సినిమాలాగా కాకుండా చాలా బాగా తీశార’’న్నారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘కథ రీత్యా ‘అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ అనే ఉపశీర్షిక పెట్టాం. కానీ తెరపై సన్నివేశాలు మాత్రం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండవు. ప్రేక్షకుల్ని ఆద్యంతం నవ్విస్తాయి. సంగీతం, ఛాయాగ్రహణం బాగా కుదిరాయి’’ అన్నారు. ‘‘చిత్రబృందం సహకారంతో ‘ఏబీసీడీ’ని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని నవ్వించేలా తీర్చిదిద్దేందుకు కృషి చేశాన’’ని దర్శకుడు చెప్పారు. ‘‘ప్రచార చిత్రానికి చక్కటి స్పందన వస్తోంది. విడుదల తర్వాత సినిమాకి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంద’’న్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో రుక్సర్‌, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.