నా కెరీర్‌లో ఇదే చివరి సీన్‌ అనుకోని..
‘క్షణం’ సినిమా విడుదలకాక ముందు వరకూ నిర్మాతలందరూ తనని విలన్‌గానే చూశారు తప్ప, ఒక యాక్టర్‌గా చూడలేదని అన్నారు అడవిశేష్‌. రెజీనాతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ఎవరు’. వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు. పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ను నటి సమంత విడుదల చేశారు. ఈ సందర్భంగా అడివి శేష్‌ మాట్లాడుతూ ‘‘నన్ను హీరోగా నమ్మిన మొదటి నిర్మాత పీవీపీ గారు. ఆ సమయంలో మహేశ్‌ సర్‌, సామ్‌లకు నాపై ఉన్ననమ్మకంతో టీజర్‌ను విడుదల చేశారు. సమంత చేతి చలవతో నాకన్నీ శుభాలే జరిగాయి. ఆమె ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాల టీజర్స్‌ని విడుదల చేశారు. ఆ రెండూ విజయం సాధించాయి. ఇప్పుడు ‘ఎవరు’ టీజర్‌ని కూడా ఆమె విడుదల చేయడం ఆనందంగా ఉంది. నాకు సినిమా అంటే పిచ్చి. అంతకుమించి గౌరవం. ‘ఎవరు’ స్టోరీ బాగా నచ్చింది. రామ్‌జీ చెప్పిన వెంటనే ఒప్పుకొన్నా. సినిమా విడులవుతుందగానే, అందరూ ‘గూఢచారి’లా ఉంటుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ చిత్రం ‘గూఢచారి’ జానర్‌తో పోలిస్తే, ‘క్షణం’కు దగ్గరగా ఉంటుంది. ఇది ఒక థ్రిల్లర్‌’’

‘‘మంచి సినిమాల్లో భాగస్వామిని కావడం నా కల. ‘క్షణం’ చేస్తున్నప్పుడు ‘హీరో అవుదామని అనుకుంటున్నావా’ అని అందరూ అడిగేవారు. హీరో కావడమే నా గోల్‌. ఈ సినిమా చేస్తున్నంత కాలం దర్శకుడు రామ్‌జీ ఒకటే చెప్పా. ‘నా కెరీర్‌లో ఇదే చివరి సీన్‌’ అనుకుని తీయమన్నా. మనం వస్తాం.. ఉంటాం.. పోతాం.. కానీ మన సినిమాలు 50ఏళ్ల తర్వాత కూడా ఉంటాయి. అలాంటి చిత్రాల్లో ఇదొకటి. సాధారణంగా థ్రిలర్ల్‌లో ఏం జరుగుతుందో నేను చెప్పేయగలను. కానీ, ఈ సినిమా నా ఊహకు అందకుండా సాగింది. అదొక్కటే సంతోషం. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే నేను నమ్మి చేశాను. మీరు నన్ను నమ్మి చూస్తారని అనుకుంటున్నా. మొదట అనుకున్న ప్రకారం.. ఆగస్టు చివరి వారంలో సినిమా విడుదల చేయాలని అనుకున్నాం. ‘సాహో’ వెనక్కి జరగడంతో ఆగస్టు 15న విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారు. దీని తర్వాత నేను ‘మేజర్‌’ సినిమా చేయబోతున్నాను’’అని అన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.