తప్పు చేయాలంటే భయపడాలి

అద్వైత్‌, జహీదా శ్యామ్‌ జంటగా నటించిన చిత్రం ‘ఎంతవారలైనా’. జి.సీతారెడ్డి ప్రధాన పాత్రధారి. ఆయనే నిర్మాత. గురు చిందేపల్లి దర్శకత్వం వహించారు. సుకుమార్‌ (సుక్కు) సంగీత దర్శకుడు. శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో సంగీత దర్శకుడు మాట్లాడుతూ ‘‘మూడు పాటలకీ చక్కటి ఆదరణ లభిస్తోంది. పాటల్ని మైసూర్‌, చిక్‌మగళూరు లాంటి అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించార’’న్నారు దర్శకుడు మాట్లాడుతూ ‘‘నిర్మాత జి.సీతారెడ్డి నా మిత్రుడు. ఆయన పోలీస్‌ అధికారిగా చక్కగా నటించారు. ఆయన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుంది. సుక్కు స్వరపరచిన పాటలు ఆదరణ పొందుతున్నాయి. తప్పు చేసినవాళ్లు ఎంతవారలయినా సరే, శిక్ష నుంచి తప్పించుకోలేరనే సందేశాన్నిచ్చే కథ ఇది. ఈ సినిమా చూసిన తరవాత తప్పు చేయడానికి కూడా భయపడతార’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘సరికొత్త కథని మంచి స్క్రీన్‌ప్లేతో దర్శకుడు మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. కథాబలమున్న సినిమాలకు ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారని మా నమ్మకం’’ అన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.