డబ్బులు ఎప్పుడిస్తావని 10మంది పోలీసులు బెదిరించారు

‘‘ప్పుడు నన్నంతా థ్రిల్లర్‌ స్టార్, బడ్జెట్‌ స్టార్‌ అంటున్నారు. కానీ, నాకవేమీ వద్దు. ప్రేక్షకులు నన్నొక మంచి చిత్రాల శేష్‌గా గుర్తుపెట్టుకుంటే చాలు. రేపు నేను చనిపోయినా సరే ప్రతిఒక్కరి మదిలో గుడ్‌ సినిమా శేష్‌గానే గుర్తుండిపోవాలి’’ అన్నారు అడివి శేష్‌. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఎవరు’. రెజీనా, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. వెంకట్‌ రాంజీ దర్శకత్వం వహించారు. పీవీపీ సంస్థ నిర్మించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం చక్కటి విజయాన్ని అందుకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అడివి శేష్‌ మాట్లాడుతూ.. ‘‘ఎవరు’కు వచ్చిన స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పంపిణీదారులు ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ను అందుకున్నారు. ఇకపై నుంచి వచ్చే ప్రతిరూపాయి నిర్మాతలు, పంపిణీదారులకు చెందేదే. నేను కాలిఫోర్నియా నుంచి వచ్చినా కృష్ణానగర్‌ కష్టాలు అనుభవించా. మాకేమీ వెనుక పెద్దగా ఆస్తులు లేవు. ‘కిస్‌’ పరాజయం నాకెన్నో పాఠాలు నేర్పించింది. రూ.2 కోట్లు అప్పు తెచ్చి ఆ సినిమా చేస్తే పూర్తిగా నష్టపోయా. జేబులో రూ.10 లేవు.. రెండు కోట్ల బాకీ ఎలా తీర్చాలనిపించింది. అప్పిచ్చిన వాళ్లు డబ్బు కోసం పోలీసులతో ఫోన్లు చేయించేవారు. ఒకానొక సమయంలో దిల్లీలో పది మంది పోలీసుల మధ్య నుంచోవాల్సి వచ్చింది. అప్పుడే నిర్ణయించుకున్నా. ఇకపై మనసుకు నచ్చిందే చేయాలి.. మనస్ఫూర్తిగా చేయాలి.. ఎవరి మాట వినకూడదనుకున్నా. ఆ సమయంలోనే నన్ను పీవీపీగారు నన్ను నమ్మి ‘క్షణం’ ఇచ్చారు. ఇప్పుడు ‘ఎవరు’తో మరో హిట్‌ ఇచ్చారు. గత 48 గంటల్లో ఆరుగురు నిర్మాతలు ఫోన్‌ చేసి ఏవైనా కథలుంటే చెప్పు నీపై నమ్మకం ఉంది అంటున్నారు. ఈ మాట కోసమే ఇంత చేశా. చిత్రసీమలో నాకున్న బ్యాగ్రౌండ్‌ అబ్బూరి రవి. నా ఈ ఎదుగుదలకు కారణం ఆయనే’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని పీవీపీ సర్‌ నా చేతిలో పెట్టేటప్పుడు మన సంస్థకు మంచి పేరు తేవాలి అన్నారు. దాన్నిప్పుడు నిలబెటుకున్నా అనుకుంటున్నా. ఈ సినిమాతో ప్రతి నటుడు, ప్రతి సాంకేతిక నిపుణుడికీ ప్రశంసలు దక్కుతున్నాయి’’ అన్నారు దర్శకుడు వెంకట్‌ రాంజీ.రెజీనా మాట్లాడుతూ.. ‘‘చిత్ర ట్రైలర్‌ చూసినప్పుడే ఇంటర్నేషనల్‌ లుక్‌ ఉందన్నారు. కానీ, ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదు. రాంజీ లేకపోతే మేమెవ్వరం లేము. ఆయనొక కొబ్బరి చెట్టులాంటి వార’’న్నారు. ‘‘ఇది మామూలుగా వచ్చిన విజయం కాదు. చిత్రీకరణ సమయంలో ప్రతి చిన్న అంశం వద్దా దర్శకుడు, శేష్‌ కొట్టుకునే వారు. కానీ, ఏదిఏమైనా చివరకు సినిమానే గెలిచింద’’న్నారు రచయిత అబ్బూరి రవి. ‘‘ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్‌ ఇవ్వడానికి చివరి ఆరు రోజుల్లో చాలా కష్టపడ్డా. ఓవైపు నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నా అంత ఒత్తిడిలోనూ చక్కటి మ్యూజిక్‌ ఇచ్చా. ఆ కష్టానికి తగ్గట్లే అద్భుత ఫలితం వచ్చింద’’న్నారు సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల. ‘‘తొలి సినిమాకే ఇంత గొప్ప పేరు రావడం నమ్మలేకపోతున్నా’’ అన్నారు ఛాయాగ్రాహకుడు వంశీ పచ్చిపులుసుల. ఈ కార్యక్రమంలో సాయి, శశి, కె.కె. తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.