‘ఏజెంట్‌’ నాకు నచ్చాడు: విజయ్‌

‘‘నవీన్‌ నాకు మంచి మిత్రుడు. నా విజయాల్ని తన విజయాలుగా భావించి సంతోషపడ్డాడు. ఇప్పుడు ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో తనకీ ఓ హిట్టు దక్కడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంద’’న్నారు విజయ్‌ దేవరకొండ. నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా హైదరా బాద్‌లో సినీ ప్రముఖుల కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘నవీన్‌తో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లో కలసి పనిచేశా. ‘ఏజెంట్‌..’తో హీరోగా తొలి అడుగులోనే విజయం సాధించాడు. ఈ సినిమా నాకు బాగా నచ్చింద’’న్నారు. ‘‘నవీన్‌ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింద’’న్నారు అడవి శేష్‌. ‘‘నెల్లూరు యాసలో నవీన్‌ పలికిన సంభాషణలు బాగున్నాయ’’న్నారు తరుణ్‌ భాస్కర్‌. ‘‘రెండేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ఈ స్పందనతో మా కష్టాలన్నీ మర్చిపోయామ’’న్నారు నవీన్‌. ఈ కార్యక్రమంలో రాహుల్‌, ఆనంద్‌ దేవరకొండ, సుహాస్‌, మార్క్‌ రాబిన్‌, అమిత్‌ త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.