ఆయన ప్రతిరోజు సెట్లోనే కనిపిస్తారు

శ్వర్యరాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. వల్లభ నిర్మాత. కె.ఎస్‌.రామారావు సమర్పకుడు. 23న విడుదల అవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘పెళ్లి చూపులు’ తరవాత కె.ఎస్‌.రామరావుగారిని కలిశాను. అప్పుడు ఒప్పుకున్న కథని ఇప్పుడు తెరపైకి తీసుకెళ్లాం. ఐశ్వర్య కూడా అందులో ఓ పాత్ర చేస్తోంది. తమిళంలో తన సినిమాలు చూసి చాలా ఇష్టపడ్డా. తను మా సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. రామారావుగారు ప్రతి రోజూ సెట్లో కనిపిస్తారు. ‘మీరు విశ్రాంతి తీసుకోండి’ అన్నా వినరు. ‘నాకు తెలిసిందే సినిమా.. దాన్ని వదలను’ అంటారు. ఎంత సంపాదించినా, పోగొట్టుకున్నా సినిమాల్లోనే అని చెబుతుంటారు. ఆయన అనుభవాలు మా అందరికీ అవసరం’’ అన్నారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘డబ్బు బాగా సంపాదిస్తే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. మంచి సినిమాలు తీస్తే నాలుగు సినిమాలు వెనకేసు కుంటారు. క్రియేటివ్‌ కమర్షియల్‌ సంస్థ అలాంటిదే. అందుకే ఇన్ని మంచి సినిమాలు వెనకేసుకుంది. నా జీవితంలో పది గొప్ప సినిమాలుంటే, అందులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ ఒకటి’’ అన్నారు. ఐశ్వర్య మాట్లాడుతూ ‘‘తమిళంలో 25 సినిమాలు చేశా. మణిరత్నం, గౌతమ్‌ మేనన్‌ లాంటి దర్శకులతో పనిచేశా. అక్కడ చేసిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘కణ’కు పది అవార్డులు వచ్చాయి. అదే నా తొలి తెలుగు సినిమా అవ్వడం నా అదృష్టం’’ అన్నారు. రాశీఖన్నా మాట్లాడుతూ ‘‘కణ’ ఓ గొప్ప కథ. ఓ అమ్మాయి కష్టపడి ఎలా పైకి వచ్చిందన్నదే కథ. ఐశ్వర్య చాలా కష్టపడింది. ఇలాంటి పాత్ర దక్కడం తన అదృష్టం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల అనుబంధం ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరికీ నచ్చే కథ ఇది’’ అన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.