అక్కినేని నా గురుతుల్యులు: చిరంజీవి
‘అక్కినేని నాగేశ్వరరావు నా గురుతుల్యులు. ఆయనతో సాంగత్యం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి. ఏఎన్నార్‌ జాతీయ పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. చిరంజీవి చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగానూ శ్రీదేవి తరఫున బోనీకపూర్, 2019 సంవత్సరానికిగానూ రేఖ పురస్కారాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఓ సంఘటన గుర్తుకొస్తోంది. అదో పల్లెటూరు. నవమాసాలు నిండిన గర్భవతి తన అభిమాన కథానాయకుడి సినిమా చూడాలనుకుంది. జట్కా బండిలో పక్కనున్న టౌనుకి భార్యతో పాటు భర్త కూడా బయల్దేరాడు. మార్గం మధ్యలో జట్కాబండి అదుపుతప్పడంతో భార్యాభర్తలు కిందపడ్డారు. అయినా సరే.. ‘సినిమాకి వెళ్లాల్సిందే’ అనుకుంది ఆ ఇల్లాలు. చివరికి సినిమా చూసే ఇంటికొచ్చింది. ఆ భార్యాభర్తలే మా అమ్మానాన్నలు. అప్పుడు మా అమ్మ కడుపులో ఉన్నది నేనే. వాళ్లు ముచ్చటపడి వెళ్లిన సినిమా ‘రోజులు మారాయి’. ఆ కథానాయకుడు ఎవరో కాదు.. అక్కినేని నాగేశ్వరరావు. బహుశా అలా అమ్మ కడుపులో ఉండగానే నాకు సినిమాలపై ప్రేమ మొదలైనట్టుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ లాంటి మహానటులు ఏలుతున్న సమయంలో నటుడిగా అడుగుపెట్టడం నా అదృష్టం. ఏఎన్నార్‌తో ‘మెకానిక్‌ అల్లుడు’లో నటించడం అద్భుతమైన జ్ఞాపకం. తరచూ ఇంటికి పిలిచేవారు. ఎన్నో విషయాలు చెప్పేవారు. నిర్మాతల పట్ల మనకున్న ధర్మం ఏంటో బోధించేవారు. ఆయన మాట్లాడేటప్పుడు నేను శ్రోతని మాత్రమే. నాకు మాట్లాడే అవకాశమే ఉండదు. ఏఎన్నార్‌ అవార్డుని శ్రీదేవి, రేఖలకు ఇవ్వడం ఎంతో సముచితం. తెలుగునేలతో వాళ్లకు ఎంతో అనుబంధం ఉంది. తెలుగువాళ్లంతా గర్వించే స్థాయిలో ఉన్నారు. శ్రీదేవి అరుదైన నటి. ఆమెలేకపోవడం మనందరి దురదృష్టం. రాజ్యసభలో రేఖ నా సహచరి. ఆమె వస్తుంటే రాజ్యసభ అంతా ఆశ్చర్యంగా చూసేవాళ్లు. ఆమెకు నా చేతుల మీదుగా ఆమెకు అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది. రేఖని ఇష్టపడితే నాకు సురేఖ దొరికింది. నా భార్యను నేను రేఖ అనే పిలుస్తాను. ‘రేఖ’ అంటే అంత ఇష్టం.’’ అన్నారు.నాగార్జున మాట్లాడుతూ ‘‘నాన్నగారి సంకల్పమే మమ్మల్ని నడిపిస్తోంది. ఆయన ఆలోచనలే ఆచరిస్తున్నాం. చిత్రసీమకు గౌరవం తీసుకొచ్చినవాళ్లని సన్మానించుకోవడంతో పాటు నాన్నగారి పేరు కూడా చిరకాలం నిలిచిపోవడం కోసం ఈ పురస్కారాలు అందిస్తున్నాం. ‘శ్రీదేవి, రేఖలకు అవార్డులు ఇవ్వాలి’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం. ‘ఆఖరి పోరాటం’లో నటిస్తున్నప్పుడు శ్రీదేవి సెట్లో అడుగుపెడుతున్నప్పుడు మేమంతా లేచి నిలబడేవాళ్లం. మాతో పాటు రాఘవేంద్రరావుగారు కూడా నిలబడేవాళ్లు. ‘మీరు నిలబడడం ఏంటి?’ అని అడిగితే ఆమె ‘దేవత’ అనేవారు. బోనీకపూర్‌ భర్తగా లభించడమే ఆమె అదృష్టం. మేమంతా కమర్షియల్‌ సినిమాలు చేస్తాం. అందులోనే విలవిలలాడిపోతాం. కమర్షియల్‌ సినిమాలతో పాటు సమాంతర చిత్రాల్ని ఎలా చేశారో రేఖగారిని అడిగి తెలుసుకోవాలి. వన్నెతరగని అందం ఆమెది. ఇద్దరు తెలుగమ్మాయిలకు నాన్నగారి అవార్డులు అందించడం ఆనందంగా ఉంద’’న్నారు.

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ‘‘అక్కినేని ఎంత గొప్ప నటుడో అంత గొప్ప మనిషి. మరో ఏఎన్నార్‌ పుట్టడు. చూడలేం. దేవలోకానికి వెళ్లిన దేవత శ్రీదేవి. హృదయ సౌందర్యం ఉన్న వ్యక్తి. రేఖ అందరితోనూ కలవలేదు. ఎవరితోనూ చెడుగా మాట్లాడదు. క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. వీరిద్దరూ మనకు గర్వకారణం’’ అన్నారు. అవార్డు అందించిన అక్కినేని కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు బోనీకపూర్‌. వేదికపై ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

రేఖ మాట్లాడుతూ ‘‘మా చిన్నాన్న వేదాంతం రాఘవయ్య ఓ అబ్బాయి గురించి తరచూ చెబుతుండేవారు. ‘కొంచెం సిగ్గు. కానీ కెమెరా ముందుకొస్తే అదరగొట్టేస్తాడు..’ అనేవారు. ‘ఆ అబ్బాయి ఎవరూ?’ అని అమ్మని అడిగితే ‘నాగేశ్వరరరావు’ పేరు చెప్పారు. అప్పుడే ‘సువర్ణ సుందరి’ చూపించారు. నేను చూసిన తొలి సినిమా అదే. ఆ సినిమాని వంద సార్లయినా చూసుంటాను. చూశాక పిచ్చిపట్టేసింది. సెట్లు, కాస్ట్యూమ్స్, డైలాగులు, పాటలు, డాన్సులు చూసి మైకం వచ్చేసింది. అప్పుడే సినిమా అంటే ఏమిటో తెలుసుకున్నా. కానీ అక్కినేనిని కలిసి మాట్లాడే అవకాశం పెద్దగా రాలేదు. అప్పట్లో అన్నపూర్ణలో షూటింగ్‌ చేసేదాన్ని. ఆయన ఇంటి ముందు నుంచి వెళ్లేటప్పుడు ఆ ఇంటికే దండం పెట్టుకునేదాన్ని. ఆ ఇంటి లోపలికి ఎప్పుడు వెళ్తానా? అనుకునేదాన్ని ఓరోజు ఆయన నన్ను భోజనానికి పిలిచారు. చాలా విషయాలు చెప్పారు. కడుపులోకి ఏం పంపుతున్నాం? బుర్రలోకి ఏం ఎక్కిస్తున్నాం? అనేది చాలా ముఖ్యం అని జాగ్రత్తలు చెప్పారు. ఆ మాటల్ని మూటలుగా కట్టుకుని ఆచరిస్తున్నా. తెలుగులో ఓ సినిమా చేయాలన్నది అమ్మ చివరి కోరిక. ఇక్కడి ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటే సినిమా చేస్తా’’ అన్నారు.


ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, అమల, అఖిల్, నాగచైతన్య, విజయ్‌దేవరకొండ, మంచు లక్ష్మి, రాహుల్‌ రవీంద్రన్, జెమిని కిరణ్, రమేష్‌ ప్రసాద్, శ్రీకాంత్‌ తదితరులతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు, అన్నపూర్ణ ఫిల్మ్‌ అండ్‌ మీడియా విద్యార్థులు పాల్గొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.